పొత్తుల ఎత్తుల‌పై జ‌న‌సేన క‌స‌ర‌త్తులు

Janasena

ఆంద్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తేం 175 సీట్ల‌కు పోటీ చేస్తామ‌ని జనసేన పార్టీ ఢంకా బ‌జాయించింది. ఒక్క వామ‌ప‌క్షాలు మిన‌హా మ‌రే పార్ట‌తోనూ పొత్తులుండ‌వ‌ని క్లారిటీ కూడా ఇచ్చింది. ఇటు అధికార పార్టీ తెలుగు దేశం, అటు విప‌క్ష వైసిపిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప‌క్కా ప్లాన్‌తో ఎన్నిక‌ల స‌మ‌రానికి దూకుతోంది. ఈ నేప‌ధ్యంలోనే జనసేన, వామపక్షాలు ఎన్నికల పొత్తులపై కసరత్తు ప్రారంభించాయి. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఇరు పార్టీల ప్రముఖ నేతలు సమావేశమయ్యారు.

ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఎవరెవరికి ఎన్ని సీట్లు? ఎన్నికల్లో పోటీకి దింపాల్సిన అభ్యర్థుల జాబితా.. ఏ స్థానం నుంచి ఏ పార్టీ పోటీ చేయాలి ? తమ పార్టీల కార్యకర్తల సంఖ్యను ఎలా పెంచు కోవాలి ? తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ చర్చ అనంతరం ఇరు పార్టీల నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో స‌మావేశ‌మ‌య్యారు. అయితే వీలైనంత త్వ‌ర‌గా అంటే సంక్రాంతి త‌ర్వాత పొత్తులు విష‌యం తేల్చేసి ఎన్నిక‌ల క‌ద‌న‌రంగానికి వెళ్లాల‌ని జ‌న‌సేనాని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.