హుషారు

న‌లుగురు చిన్న‌నాటి స్నేహితుల చుట్టూ సాగే క‌థే ఈ చిత్రం. జీవితంలో న‌చ్చిన ప‌ని చేస్తూ, స్నేహితులు కుటుంబంతో క‌లిసి ఆడుతూ పాడుతూ బత‌కాల‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. సినిమాలో మాత్రం ఇంత క‌థ కూడా ఉండ‌దు. న‌వ‌త‌రం ఆలోచ‌న‌ల‌కి, అల‌వాట్ల‌కి అద్దం పట్టే స‌న్నివేశాల్ని తీర్చిదిద్ది… వాటిలో మంచి వినోదం, భావోద్వేగాల్ని పండించే ప్ర‌య‌త్నం చేశారు. దాంతో ఓ మంచి కాల‌క్షేపంలా మారిపోయింది సినిమా.

తొలి స‌గ‌భాగం క‌థంతా కూడా స్నేహితులు క‌లిసి చేసే అల్ల‌రి ప‌నులు, వాళ్ల ప్రేమ‌, రొమాన్స్‌తోనే సాగుతుంది. కానీ ఆ స‌న్నివేశాల్నే నాణ్య‌త‌తో తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకునేలా రొమాంటిక్ స‌న్నివేశాల్ని, ఆహ్లాదంగా తీర్చిదిద్దాడు. విరామానికి ముందే ఓ చిన్న కాన్‌ఫ్లిక్ట్‌. అప్ప‌ట్నుంచైనా క‌థ ఉంటుందేమో అనుకొంటారంతా. కానీ క‌థగా కాకుండా ఓ జ్ఞాపకాల్లాగా స‌న్నివేశాలు సాగిపోతుంటాయి. ఒక ప‌క్క బీర్ త‌యారు చేసి అమ్మాల‌ని ప్ర‌య‌త్నించ‌డం… మ‌రోప‌క్క చావు బ‌తుకుల్లో ఉన్న స్నేహితుడిని గ‌ట్టెక్కించాల‌నే త‌ప‌న‌… వీటి మ‌ధ్య‌లో అనుకోకుండా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌తో అక్క‌డ‌క్క‌డ మంచి భావోద్వేగాలు పండాయి. ఫ్ర‌స్ట్రేటెడ్ ఐటీ ఉద్యోగి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఎంట్రీ ఇచ్చాక క‌థలో మ‌రింత జోష్ వ‌స్తుంది.

అత‌ని స‌హ‌కారంతో న‌లుగురు స్నేహితులు తాము అనుకొన్న‌ది చేయ‌డంతో క‌థ సుఖాంత‌మ‌వుతుంది. ద్వంద్వార్థాల‌తో కూడిన సంభాష‌ణ‌లు, పెద్ద‌ల‌కి మాత్ర‌మే అనిపించే స‌న్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. కానీ ద‌ర్శ‌కుడు యూత్‌నే టార్గెట్ చేసి తీసిన సినిమా కావ‌డంతో, వాళ్ల‌కి న‌చ్చితే చాల‌న్న‌ట్టుగా త‌న ప‌ని తాను చేసుకుపోయిన‌ట్టు అనిపిస్తుంది.