తెలంగాణ ఎమ్మెల్యేల‌కు ఇక నిద్ర‌లేని రాత్రులే..!

KCR

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌పై వున్న అనుమానాలు కూడా ప‌టాపంచ‌లు అయిపోయాయి.గ్రామ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కుద‌ర‌ద‌ని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. ఇది కూడా కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తొంద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ఆశావ‌హుల ఆశ‌లు నీరుకారాయి. ఈనెల 21న తొలి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల ప్రక్రియ జనవరి 30తో ముగుస్తోంది.ఈలోపు సహకార ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు ఎన్నికల్లో అత్యధిక వార్డులతో పాటు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పదవులను కైవసం చేసుకోవాలని అటువంటి వారికే మంత్రి పదవుల్లో చోటు కల్పిస్తామన్న షరతు కూడా విధించే అవకాశాలు లేకపోలేదని టిఆర్ ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆశావహుల్లో టెన్షన్‌ అంతకంతకూ పెరుగుతోంది. మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లో మకాంవేసి తరచూ తెలంగాణ భవన్‌కు వస్తూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలుస్తూ మంత్రివర్గంలో తమకు చోటు కల్పించేలా చూడాలని కొందరు కోరుతున్నారు. మరికొందరు అధినేత కేసీఆర్‌కు తమ పేర్లను సిఫారసు చేయాలని అభ్యర్థిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గంలో సీఎం కేసీఆర్‌తో పాటు మరో 17 మందిని తీసుకునే అవకాశం ఉంది. సీఎంగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉప ముఖ్యమంత్రిగా మహమూద్‌ అలీకి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.ఆయనకు హోంమంత్రిత్వ శాఖను కట్టబెట్టారు.

ఇంకా 16 మందిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించకుండా ఈ విడత మరో 8 నుంచి 10 మంది కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయని టిఆర్ ఎస్ లో, బయట విస్తృతంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. జనవరి 21 నుంచి నాలుగు రోజులపాటు సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మరో చండీ యాగానికి రూపకల్పన చేశారు. అదే సమయంలో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతుండడంతో మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి.