గ్రేట‌ర్ బ‌డ్జెట్ కు కౌన్సిల్ గ్రీన్ సిగ్న‌ల్

GHMC Mayor
GHMC Mayor

2019-20 సంవ‌త్స‌రానికి హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ను జీహెచ్ఎంసీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఏక‌గ్రీవంగా ఆమోదించింది. మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న జీహెచ్ఎంసీ వార్షిక బ‌డ్జెట్ స‌మావేశం జ‌రిగింది. 2019-20కి రూ. 11,538 కోట్ల‌తో బ‌డ్జెట్‌ను మేయ‌ర్ రామ్మోహ‌న్ ప్ర‌వేశ‌పెట్టారు. జీహెచ్ఎంసీకి రూ. 3,210 కోట్లు రెవెన్యూ ఆదాయంగా ప్ర‌క‌టించారు.

రెవెన్యూ ఆదాయంలో అధిక శాతం రూ. 1,694 కోట్లు ఆస్తిప‌న్ను రూపంలో ల‌భించ‌నుంది. జీహెచ్ఎంసీ బ‌డ్జెట్‌లో రూ. 6,150 కోట్ల‌లో రెవెన్యూ వ్య‌యం రూ. 2,808 కోట్లు కాగా క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 3,342 కోట్లుగా ఉంద‌ని మేయ‌ర్ ప్ర‌క‌టించారు. 14వ ఫైనాన్స్ క‌మిష‌న్ కింద రూ. 418.82 కోట్లు భార‌త ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి అంద‌నున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ద్వారా రూ. 5,188 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో ఇప్ప‌టికే 30,562 ఇళ్ల నిర్మాణం ముగింపు ద‌శ‌కు వ‌చ్చాయ‌న్నారు. ఈ ఇళ్ల‌ కేటాయింపును రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి అందే విధివిధానాల ఖ‌రారు అనంత‌రం చేప‌ట్ట‌నున్నామ‌ని మేయ‌ర్ తెలిపారు. న‌గ‌రంలో వీధిదీపాల నిర్వ‌హ‌ణ‌కు రూ. 44కోట్లు కేటాయించిన‌ట్టు మేయ‌ర్ రామ్మోహ‌న్ ప్ర‌క‌టించారు .

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని గ్రీన్ సిటీ రూపొందించేందుకు కోటి మొక్క‌ల‌ను నాటనున్నామ‌ని తెలిపారు ఆయ‌న‌. అనంత‌రం ఈ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై ప‌లువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల‌తో పాటు స‌భ్యులు ప‌లు సూచ‌న‌లు అంద‌జేశారు. ఈ స‌మావేశానికి క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్‌, న‌గ‌రంలోని ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.