గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్ క‌న్నుమూత‌

Manohar Parrikar
Manohar Parrikar

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల నుంచి ఆయ‌న‌ పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఆదివారం రాత్రి 8.15 గంటలకు కన్నుమూశారు. పారికర్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య కూడా కేన్సర్‌ వ్యాధితో 2001లో కన్నుమూసింది .

ఇటీవల అసెంబ్లిలో బడ్జెట్‌ సమావేశాలకు పారిక‌ర్ హాజరయ్యారు. వైద్యులు, వ్యక్తిగత సహాయకుల పర్యవేక్షణలో సభకు వచ్చిన ఆయన, బడ్జెట్‌ ప్రసంగాన్ని పూర్తిచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన పారికర్‌, మూడు సార్లు గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నరేంద్ర మోడీ కేబినెట్‌లో కీలకమైన రక్షణశాఖ మంత్రిగా ప‌నిచేశారు.

2017 గోవా ఎన్నికల్లో తన రాజకీయ వ్యూహ చతురతతో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. గోవా ప్రజలకు అత్యంత ఆత్మీయుడిగా, ప్రియతమ నేతగా ఆయ‌న‌కు ఎన‌లేని గుర్తింపు వుంది. పారికర్‌ మరణం పట్ల రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి సంతాపం వ్యక్తంచేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.