తెలంగాణ‌లో ఫ‌స్ట్ ఫేజ్ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ నామినేషన్లు

panchayat elections
panchayat elections

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ‌లో తొలి విడుతకు సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ‌మ‌య్యంది. మూడు ఫేజ్ ల‌లో పంచాయతీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. తొలి విడుతలో 30 జిల్లాల పరిధిలోని 197 మండలాలు, 4,480 గ్రామపంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ జ‌ర‌గ‌నుంది. 4,480 గ్రామసర్పంచ్ స్థానాలు, 39,832 వార్డుసభ్యుల స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మండలాలవారీగా నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తీసుకుంటారు . ఈ నెల 10న నామినేషన్లను పరిశీలించి జాబితాను ప్రదర్శిస్తారు. 11న అభ్యంతరాలను స్వీకరించి, 12న పరిష్కరిస్తారు . ఉపసంహరణకు గడువు కూడా అదే రోజు. ఆరోజు సాయంత్రం సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.

ఈ నెల 13 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చు. 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు . ఆయా జిల్లాలకు పరిశీలకులను నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి చెప్పారు . నామినేషన్లు దాఖలుచేసే సందర్భంగా అభ్యర్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాలు సూచించింది. కుల ధ్రువీకరణ పత్రం, వయసు నిర్ధారణ కోసం జనన ధ్రువీకరణ లేదా పదో తరగతి మెమో జిరాక్స్, విద్యార్హతలకు సంబంధించిన అఫిడవిట్, ఆస్తుల వివరాలు, కోర్టు కేసులు, ఇతర పదవులు ఉంటే రాజీనామా ఆమోదించిన పత్రాలు, ఉద్యోగి అయితే రాజీనామా ఆమోదించిన పత్రాలు, గ్రామపంచాయతీ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ప్రకటించాలి.

సర్పంచ్ అభ్యర్థి గ్రామంలో ఓటరుగా, వార్డు స్థానానికి పోటీచేసే అభ్యర్థి వార్డు పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లతోపాటు బ్యాంక్ ఖాతా కొత్తగా తీసి, పాస్ పుస్తకం జిరాక్స్ అందజేయాలని ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది ప్రచార ఖర్చులన్నీ బ్యాంకు నుంచే చెల్లించాలని వెల్ల‌డించింది.