తెలుగు రాష్ట్రాల్లో మండ‌లి ఎన్నిక‌ల‌కు మోగిన న‌గారా

Elections
Elections

తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మార్చి నెలాఖరుతో పదవీకాలం ముగియనున్న శాసనమండలి స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది.

ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇరు రాష్ట్రాల్లోనూ మార్చి 12న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 21న విడుదల చేయనున్నట్టు సీఈసీ వెల్ల‌డించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఫిబ్రవరి 21 నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమై 28న ముగుస్తుంది. మార్చి ఒకటిన నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 5. ఇక‌ 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కించి ఫలితాల ప్రకటిస్తారు.

తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన హోంమంత్రి మహమూద్ అలీ, సంతోష్‌కుమార్, మహ్మద్ సలీంల పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రి నారాయణ, శమంతకమణి, లక్ష్మీ శివకుమారి, ఆదిరెడ్డి అప్పారావుల పదవీ కాలం కూడా మార్చి 29న ముగియనుంది.