ఈబీసీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

ebc-reservation-bill

చారిత్రాత్మక 124వ రాజ్యాంగసవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన ఈ బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు లభించాయి. దీంతో మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు సవరణకు లోక్ సభ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తొందరపాటుతో ఈ రాజ్యాంగసవరణ బిల్లు తెచ్చారని కాంగ్రెస్‌ ఎంపీ కెవి.థామస్‌ లోక్‌సభలో అన్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే ఈ బిల్లు తెచ్చారన్నారు. ఎనిమిది లక్షల రూపాయల పరిమితి విధించడం వల్ల సంపన్నులకు సైతం ప్రయోజనం కలుగుతుందన్నారు.హడావిడిగా బిల్లు తెచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

ఈ బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.ఈ బిల్లును తాము వ్యతిరేకించడం లేదని అయితే జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్‌ చేశారు. ఇటు రిజర్వేషన్లు లేని పేద వర్గాలకు లాభం చేకూర్చేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్ప‌ష్టం చేశారు.ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయమైనందున దీనికి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు లేని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నాయన్నారు. ఇక ఈబిసి బిల్లుకు తాము మద్దతు తెలుపుతున్నామని టిఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. అయితే తెలంగాణ రిజర్వేషన్ల విధానానికి కూడా కేంద్రం ఆమోదం తెలపాలని కోరారు.

అటు ఆర్థికబాటు వెనుకబాటు అంశాన్ని గుర్తించేందుకు ఎటువంటి ఆధారం లేకుండా బిల్లు ఎలా తీసుకువచ్చారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన చట్టానికి కేంద్రప్రభుత్వం ఆమోదం ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు. ఈ బిల్లు సుప్రీంకోర్టులో కొట్టివేయడం ఖాయమని అన్నారు. ఈ నేప‌ధ్యంలో డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయించారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల డివిజన్ ఓటింగ్ తప్పనిసరి అని స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్ల‌డించారు. అనంతరం, సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై ఓటింగ్ జరిగింది.