‘ఇస్మార్ట్ శంక‌ర్’ టీజ‌ర్‌ : డ‌బుల్ దిమాఖ్ హైద‌రాబాదీ

Ismart Shankar
Ismart Shankar

రామ్ – పూరి కాంబోలో తెర‌కెక్కిన సినిమా ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ . పూరి సినిమా అంటే ప‌క్కా మాస్ మ‌సాలా. దాన్ని ఇప్పుడు తెలంగాణ స్లాంగ్‌లో వండి వారిస్తే… ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ త‌యార‌వుతాడు. ఈరోజు రామ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్ విడిచిపెట్టారు. రామ్ గ‌త సినిమాల‌తో పోలిస్తే.. పూరి గ‌త చిత్రాల‌తో పోలిస్తే.. ఈ సినిమాలో హీరో ‘డ‌బుల్‌’ మాస్‌గా క‌నిపిస్తున్నాడు. డ‌బుల్ దిమాఖ్ హైద‌రాబాదీ అనే క్యాప్ష‌న్‌కి 100 % న్యాయం చేసేలా టీజ‌ర్‌ని క‌ట్ చేశాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఓ ఆవారా హైద‌రాబాదీ చేసే దందా నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. పూరి మార్క్ హీరోయిజం, టేకింగ్‌… ఇందులో క‌నిపించాయి. రామ్ గెట‌ప్ కొత్త‌గా ఉంది. ఫుల్లు గెడ్డంతో క‌నిపిస్తున్నాడు. ‘మార్ ముంతా.. ఛోడ్ చింతా’ అనే డైలాగ్ ద‌గ్గ‌ర‌… రామ్‌నైతే అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేం. తెలంగాణ స్లాంగ్‌లో రామ్ డైలాగులు చెప్ప‌డం కూడా ఇదే. దానిపై బాగానే క‌స‌ర‌త్తులు చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. రామ్ పుట్టిన రోజు టీజ‌ర్ కాబ‌ట్టి – ఫోక‌స్ అంతా ఆ క్యారెక్ట‌ర్‌పైనే సాగుతోంది. టీజ‌ర్‌లో మంచి మాస్ పాట కూడా పెట్టేశాడు. ట్రైల‌ర్ ఇచ్చేంత కిక్ ఈ టీజ‌ర్‌తోనే వ‌చ్చేసింది.