నేడు ఎమ్మెల్యే … నాడు సర్పంచ్..

dvk mla

నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ రాజకీయ ప్రస్థానం సర్పంచ్ నుంచే మొదలైంది. దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రత్యతండా రవీంద్రకుమార్ స్వస్థలం.డిగ్రీ ఫైనలియర్ చదువుతుండగానే రవీంద్రకుమార్‌కు 1995లో శేరిపల్లి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది.

సీపీఐ మద్దతుతో పోటీ చేసిన ఆయన తన ప్రత్యర్థిపై 150 ఓట్ల మెజార్టీతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.రెండో సారి 2001లో తన ప్రత్యర్థిపై 70 ఓట్ల మెజార్టీతో రవీంద్రకుమార్ సర్పంచ్‌గా గెలుపొందారు. సర్పంచ్‌గా మూడేండ్ల పదవీ కాలం పూర్తయిన అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీపీఐ నుంచి 2004లో దేవరకొండ ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వచ్చింది.

ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. 2014లో మరోసారి సీపీఐ నుంచే పోటీచేసి ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొందారు.టీఆర్‌ఎస్ తొలిసారిగా అధికారంలోకి వచ్చాక సీపీఐ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీని సాధించడం విశేషం.