చంద్రుడి చూపు మ‌ళ్లీ ప‌వ‌న్ కళ్యాణ్ వైపు

CBN,Pawan Kalyan

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు వేడెక్కాయి. ఎన్నిక‌ల‌కు మ‌రికొన్ని నెల‌లు వున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు ఊపందుకున్నాయి. తాజాగా వామ‌ప‌క్షాల‌తో మిన‌హా తాము ఎవ‌రితో పొత్తు పెట్టుకొమ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఢంకా బ‌జాయించారు. ఏపిలోని 175 సీట్ల‌కు పోటీ చేస్తామ‌ని క్లారిటీ ఇచ్చారు కూడా. ఈ నేప‌ధ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రం కోసం తమతో కలిసి రావాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత,ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ముగ్గురు మోదీలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని..ఒకరు బీజేపీతో కలిసిపోయారని.. ఇంకొకరు వన్ సైడ్‌గా పనిచేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రం కోసం తమతో కలిసి అడుగులు వేయాల‌ని కోర‌డం ఇప్పుడు ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌లో సంచ‌ల‌నంగా మారింది. కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి డెబ్భై రెండు వేలకోట్లు రావాలని పవన్ కళ్యాణ్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి మరీ తేల్చారన్నారు సీఎం చంద్రబాబు. అంత భారీ నిధులు ఏపీకి రాకుండా చేస్తున్న కేంద్రంపై పోరాటంలో పవన్ ప్రభుత్వంతో కలిసి వస్తారా ? లేక ఒంటరిగా పోరాడతారా అన్నది ఆయన ఇష్ట‌మని అన్నారు చంద్ర‌బాబు. ఇప్ప‌టికే కాంగ్రెస్ తో కూట‌మి జ‌త క‌ట్టిన ఆయ‌న ప‌వ‌న్ ని త‌మ‌తో వ‌స్తారా అని ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఆంద్ర‌ప్ర‌దేశ్ లో హాట్ టాపిక్ అయింది.