అసెంబ్లీ వేదిక‌గా బిజేపిపై సిఎం చంద్ర‌బాబు గ‌రం గ‌రం

TDP, Jagan, YSR, YSRPARTY,
Chandra Babu

విభజన చేసిన కాంగ్రెస్‌ పుట్టగతులు లేకుండాపోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి చెప్పిన దానికంటే ఎక్కువే చేశామంటూ బిజేపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు చేసిన వ్యాఖ్యలపై సీఎం అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయమేంటో చెప్పాలంటూ సభలో అందరి ముందూ ఆయన్ను నిలదీశారు. తెలుగువాళ్లకు పౌరుషం లేదనుకున్నారా ? అంటూ విష్ణుకుమార్‌ రాజు, బిజేపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . నమ్మించి మోసం చేసిన బీజేపీకి ప్రజలు అంతకంటే పెద్ద శిక్ష వేస్తారని జోస్యం చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారని.. అసెంబ్లీకి మాత్రం రారని విమర్శించారు.

జీవితంలో తొలిసారి నల్లచొక్కా ధరించి నిరసన తెలుపుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్నీ ఇచ్చిన జన్మభూమి కోసమే నల్లచొక్కా వేసుకున్నానన్నారు ఆయ‌న . దేశంలో సీనియర్ రాజకీయవేత్తనని, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, తొలి ఎన్డీయే ప్రభుత్వంలో తాను భాగస్వామినని .. అయినా కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇండియా మ్యాప్ నుంచి ఏపీని తీసేస్తారేమోనని వాపోయారు. సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక్క లీడర్ లేరని, ఉన్న ఒక్క వెంకయ్య నాయుడిని కేబినెట్ నుంచి పంపేశారని విమర్శించారు. అన్ని రాష్ట్రాల తిరిగే వెంకయ్యను ప్రభుత్వం నుంచి పక్కన పెట్టారన్నారు. దక్షిణ భారత నేతలకు ఏం గౌరవం ఇచ్చారో బీజేపీ చెప్పాలని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

దీనికి ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సీఎం చంద్రబాబు నల్లచొక్కాతో హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియజేశారు . టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది నల్లచొక్కాల్లోనే అసెంబ్లీకి రాగా, కొందరు నల్లచొక్కా, నల్లప్యాంటు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. అందరూ మూకుమ్మడిగా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.