ప్ర‌భుత్వ ఉద్యోగులకు ఏపి స‌ర్కారు బంప‌ర్ ఆఫ‌ర్

ap capital amaravati
ap capital amaravati

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్న ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 20 శాతం మధ్యతంర భృతిని బంప‌ర్ ఆఫ‌ర్ గా ప్రకటించింది. వెల‌గ‌పూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్య‌క్ష‌త‌న‌ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు రెండు గంటల సేపు ఈ భేటీ జ‌రిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న మధ్యంతర భృతిపై సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హ‌ర్షం వ్యక్తం చేశారు. జూన్‌ 1 నుండి ఉద్యోగులకు 20 శాతం మధ్యం తర భృతి ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ వర్గాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకుంది. స‌మావేశం అనంత‌రం మంత్రివ‌ర్గం తీసుకున్న నిర్ణ‌యాల‌ను మంత్రులు కాలువ శ్రీనివాసులు, గంటా శ్రీనివాస్‌లు మీడియాకు వెల్ల‌డించారు.

విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్‌ ఇవ్వాలని నిర్ణ యించారు. డీఏ తప్ప 10 రోజుల విరామంతో 12 నెలల జీతం చెల్లించేందుకు డిసైడ్ అయ్యారు. మెటర్నటీ సెలవులను ఇచ్చేందుకు నిర్ణయించారు. విజయనగరంలో గురజాడ పేరుతో మరో యూనివర్సిటీని ఏర్పాటుకు అమోద ముద్ర వేశారు. ఎన్‌ఎంఆర్‌, రోజువారీ వేతనాలు పొందే ఉద్యోగులకు క్యాజువల్‌ సెలవులతోపాటు హెల్త్‌ కార్డులను కూడా పంపిణీ చేయాలని తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం లభించింది. అగ్రి గోల్డు బాధితులకు హైకోర్టు ఆదేశాలను అనుసరించి సత్వర చెల్లింపులు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఏప్రిల్‌ మొదటి వారంలో ఈ చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంది. సత్వర ఊరటగా రూ. 250 కోట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ముందుకొచ్చింది. ఇక జేఎన్‌టీయూ కొత్త యూనివర్సిటీని రాజధానిలో ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. నూతన యూనివర్సిటీని మోడల్‌ యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ముఖ్యమంత్రి సూచన మేరకు విజయనగరంలో నూతనంగా ఏర్పాటుచేసే విశ్వవిద్యాలయానికి గురజాడ అప్పారావు పేరు పెట్టాలని మంత్రి మండలిలో నిర్ణయించారు.