కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా ప‌ట్టు నిలుపుకున్న విక్ర‌మార్కుడికే ఛాన్స్ ..!

Mallu-Bhatti-Vikramarka

తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన కాంగ్రెస్ పార్టీకి సిఎల్‌పి నేత‌గా ఎవ‌రిని నియ‌మించాల‌నేది కూడా కాస్త క‌ఠినంగా మారింది. అసెంబ్లీలో ప‌రువు పోయి ప‌ట్టు నిలుపుకోవాల్సిన వేళ‌లో అధిష్టానం చూపు ఇప్పుడు విక్ర‌మార్కుడు వైపు ప‌డిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను పార్టీ హైక‌మాండ్ ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భట్టినే సీఎల్పీ నేతగా నియమించాల‌న్న భావనతో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉన్నట్టు అనుకొంటున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులను తమవైపు తిప్పుకోవాలని టి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ భావిస్తున్ననేప‌ధ్యంలో,వారిని నియంత్రించడానికి భట్టి విక్రమార్క వంటి నేత సరిపోతారని కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తున్నట్టు చెబుతున్నారు.దళితుడైన భట్టి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడంతోపాటు ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం కూడా భట్టికి అదనంగా కలిసివచ్చిన అంశం.

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 19 అసెంబ్లి స్థానాలను కైవసం చేసుకోగా.. ఖమ్మం జిల్లాలోనే మహాకూటమితో కలిపి 8 స్థానాలను చేజిక్కించుకున్నారు. దళితుడికి సీఎల్పీ పదవిని కట్టబెట్టడం ద్వారా ప్రజల్లో మంచి సంకేతాలు ఇవ్వవచ్చన్న భావనతో కూడా కాంగ్రెస్‌ పార్టీ హైక‌మాండ్ ఉంది.వివాద‌ర‌హితుడిగా పేరున్న భట్టిని సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తే, పార్టీలో వ్యతిరేకించేవారు కూడా ఎవరూ ఉండరని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ హై క‌మాండ్ ఆయ‌న వైపు మొగ్గు చూపే అవ‌కాశం వున్న‌ట్లు తెలుస్తోంది.