తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎవ‌రో తెలుసా..!

bhatti vikramarka
bhatti vikramarka

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా భట్టికి అవకాశం దక్కనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను రాహుల్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. సీఎల్పీ రేసులో సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నప్పటికీ ఈ పదవి దళిత వర్గానికి చెందిన భట్టికే దక్కింది.

శాసనసభ వ్యవహారాల్లో అనుభవం, సామాజిక సమీకరణాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని భట్టి పేరును ఖరారు చేసింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేడెక్కుతున్న నేపథ్యంలో ఎస్సీ వర్గానికి చెందిన మల్లు భట్టివిక్రమార్కకు కీలకమైన సీఎల్పీ నేత పదవి ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్న సంకేతాన్ని ఏఐసీసీ ఇచ్చినట్లయింది. తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షానికి తొలి దళిత నాయకుడిగా భట్టికి అవకాశం కల్పించినట్లయింది.

2009లో, 2014లో భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా గెలిచారు . 2018లో మధిర నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. 2014లో తెలంగాణ మేనిఫెస్టోకమిటీ కో కన్వీనర్‌గా, 2014 నుంచి 2018 వరకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి మూడోసారి గెలుపొందారు. సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్కకే ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్లు సినీ సార‌ధి ముందే వెల్ల‌డించింది.