ఎన్నిక‌ల‌కు ముందే ఏపి స‌ర్కారు తాయిలాల ప్ర‌క‌ట‌న

AP

ఎన్నిక‌ల వేళ ఆంద్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ వివిధ వర్గాల ప్రజలకు వరాల జల్లు కురిపించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ క్యాబినెట్ లో పలు కీలక అంశాలను ఆమోదించింది.ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విధివిధానాలను అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు కేబినెట్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1.572 శాతం డీఏ చెల్లింపునకు క్యాబినెట్ ఆమోదం తెలపింది.

డ్వాక్రా మహిళలకు రెండో విడ‌త పసుపు-కుంకుమ కింద పది వేల రూపాయల చెల్లింపుతో పాటు డ్వాక్రా సభ్యులకు సెల్ ఫోన్ అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 2014 తర్వాత ప్రభుత్వ సాయం లేకుండా నిర్మించుకున్న ఇళ్లకు అరవైవేల రూపాయల సాయం అందిచాలని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు జీవితకాల పన్ను మినహాయింపుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. చేనేత కార్మికులకు ఆరోగ్యబీమా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించాలని, ఎకరా రూ.25 లక్షలు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.