కాలిన‌డ‌క‌న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కు వెళ్లిన ఏపి సిఎం చంద్ర‌బాబు

Chandrababu Naidu
Chandrababu Naidu

ప్రధాని నరేంద్ర మోడీకి నాయకత్వ లక్షణాలు లేవన్నారు ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు . ఏపీ భవన్‌ నుంచి తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఆయ‌న కాలినడకన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో స‌మావేశం అయ్యారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై రాష్ట్రపతికి 18 డిమాండ్లతో కూడిన 17 పేజీల వినతిపత్రాన్ని చంద్రబాబు రాష్ట్రపతికి సమర్పించారు.

విభజన హామీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంత‌రం ఏపి సిఎం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఏపీకి చేసిన మోసాన్ని రాష్ట్రపతి కి వివరించామన్నారు. విభజన హామీలను కేంద్రం విస్మరించిందని ఆయన విమర్శించారు. ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు సిఎం.

ఏపీకి నిధులు విడుదల చేయకుండా కేంద్రం కాలక్షేపం చేసిందని మండిపడ్డారు ఆయన.రాష్ట్రపతి రాజ్యాంగపరమైన అధినేత అని, అంతిమంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, వారి మనోభావాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రధాని స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఏపి సిఎం చంద్ర‌బాబు .