హ‌స్తిన వేదిక‌గా ఏపి సిఎం చంద్ర‌బాబు మంత్రాంగం

Chandra-Babu
Chandra-Babu

సార్వత్రిక ఎన్నికలు పొంచివున్న నేప‌ధ్యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ సిఎం చంద్ర‌బాబు హ‌స్తిన బాట ప‌ట్టారు. ఇటు బిజేపియేత‌ర కూట‌మిని ఒక‌టి చేసే విధంగా మంత్రాంగం న‌డుపుతున్నారు. దీనిలో భాగంగానే దేశ రాజ‌ధానికి వ‌చ్చీరాగ‌నే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ మంతనాలు సాగించారు.సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లికి కూడా ఎన్నికలు జరగనున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు, సీట్ల సర్దుబాటు కొనసాగించే విషయంపై రెండు పార్టీల అధినేతలు ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం.అయితే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లి ఎన్నికల్లో పొత్తులు ఫలించకపోగా, వికటించాయని కాంగ్రెస్‌ నేతలు అధిష్టానం నేతలకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో,ఏపీలో పొత్తుల కొనసాగింపుపై ప‌లు సందేహాలు నెలకొన్నాయి.అయితే ఏపీ కాంగ్రెస్‌ నేతల్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండాలనే కోరుకుంటున్నట్టు తెలిసింది.

పొత్తుంటే కొన్నిసీట్లయినా గెలిచి అటు అసెంబ్లిలో , ఇటు లోక్‌సభలో ప్రాతినిధ్యం పొందవచ్చని వారు అధిష్టానం నేతలకు సూచించినట్టు తెలిసింది.మరోవైపు చంద్రబాబు నాయుడు జాతీయస్థాయి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీతో చెలిమి, పొత్తులు కొనసాగించాలని భావిస్తున్నారు.బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకతాటి మీదికి తీసుకొచ్చే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తున్న తరుణంలో రాహుల్‌ గాంధీతో చంద్ర‌బాబు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.