తెలుగు రాష్ట్రాలలో ప్రచారం పరి సమాప్తం

AP Elections 2019
AP Elections 2019

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. రెండు వారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. అన్ని పార్టీల అగ్రనేతలు తమ ప్రచార పర్వాన్ని పరుగులెత్తించారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు, ఆంద్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 11 న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో టి ఆర్ ఎస్ 16 స్థానాల్లో పోటీ చేస్తుండగా హైదరాబాద్ స్థానాన్ని ఎం ఐ ఎం కు కేటాయించింది. ఇక అధికార టి ఆర్ ఎస్ తరపున పార్టీ అధినేత కేసీఆర్ , వర్కింగ్ ప్రసిడెంట్ కే టీ ఆర్, హరీష్ రావు, కవిత, పలువురు మంత్రులు ప్రచారంతో పాటు రోడ్ షో లు నిర్వహించారు. అటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను బరిలోకి దింపింది.

ఆ పార్టీ ఛీప్ రాహుల్ తో పాటు పిసిసి నేతలు ఉత్తమ్, భట్టి, విజయశాంతి తదితర స్టార్ కాంపెయినర్ లు ప్రచారంలో పాల్గొన్నారు. టి ఆర్ ఎస్ కు ధీటైన పోటీ ఇచ్చేందుకు చెమటోడ్చారు ఆ పార్టీ నాయకులు. బిజేపి తరపున ప్రధిని మోదీ, పార్టీ ఛీప్ అమిత్ షా , పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. ఇటు ఏపి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం , వైసిపి, జనసేనలతో పాటు పలు జాతీయ పార్టీలు పొత్తులతో బరిలో నిలిచాయి. అయితే పార్టీ అధినేతల మధ్య ప్రచార హోరు హోరా హోరీగా సాగింది. విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత వేడిని పుట్టించాయి. పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్ , పవన్ లు వేసవిని సైతం లెక్కచేయకుండా ప్రచారాన్ని రక్తి కట్టించారు. ఓటర్లును అన్ని కోణాల్లో ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.

తెలుగుదేశం ప్రచారంకు కేజ్రీవాల్ ,మమతా బెనర్జీ, దేవగౌడ వంటి నేతలు ప్రచారం చేశారు. ఇక బాలయ్య, లోకేష్ పలువురు మంత్రులు ప్రచారంలో మరింత వేగాన్ని పెంచారు. అటు వైసిపి తరపున జగన్ తో పాటు విజయమ్మ, షర్మిల వంటి నేతలతో పాటు పలువురు సినీతారలు ప్రచారంలో జోరు ప్రదర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుడిగాలి ప్రచారం చేయగా ఆయనకు మద్దతుగా బి ఎస్ పి అధినేత మాయావతి ప్రధాన కేంద్రాలలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ , బిజేపి తరపున హస్తిన అగ్రనేతలు ప్రచార సభలు జరిపారు. సిపిఎం, సిపిఐ,ల తరపున ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కే ఏ పాల్ ప్రచారంలో తన శైలిని ప్రదర్శించారు. ఇక ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభాల పర్వం ప్రారంభయింది.