కుంభ‌మేళాకు స‌ర్వం సిద్దం

Uttar Pradesh Kumb Mela

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది. సంక్రాంతి నుంచి మహా శివరాత్రి అంటే మార్చి 4 వరకూ ఈ వేడుక కొనసాగుతుంది. ఈ సమయంలో గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు చేసిన భక్తుల పాపాలు నశించి, మోక్షం ప్రాప్తిస్తుందని పురాణ కథనం.

ఆరేళ్లకోసారి ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే కుంభ్‌మేళాకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కూడా లభించింది. జనవరి 15న ఉదయం 5.15 నుంచి సాయంత్రం 4.20 గంటల వరకూ మొదటి రాజయోగ స్నానానికి యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఘాట్‌లు సిద్ధం చేసింది. ఈ స్నానాలు చేయడానికి బంగారు, వెండి పల్లకీలపై, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులపై అనుచరగణంతో ఊరేగింపుగా తరలివచ్చే నాగ సాధువులు, సన్యాసులు, యోగులతో ప్రయాగ్‌రాజ్‌ సందడిగా మారనుంది. రంగురంగుల ముగ్గులు, పూల తోరణాలతో వీరు వచ్చే మార్గాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. హర హర మహాదేవ్ నినాదాలతో పురవీధులు మార్మోగుతాయి. వీరంతా నదిలో స్నానాలు చేసిన తర్వాతే సాధారణ ప్రజలు మునుగుతారు . ఈ సమయంలో సాధువుల ఆశీర్వాదాల కోసం భక్తులు పోటీలు పడతారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూసేందుకు దేశ, విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు.