గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ఓట్ల లెక్కంపుపై పెరిగిన ఉత్కంఠ‌

Telangana Elections
Telangana Elections

తెలంగాణ‌లో పోలింగ్‌ జరిగిన ఆరువారాల అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి అనుచరుల్లో ఉత్కంఠ మొదలైంది. హైదరాబాద్‌ లోక్‌సభపై ఎంఐఎం పూర్తి భరోసా ఉండగా , సికింద్రాబాద్‌ లోక్‌సభ విజయంపై బీజేపీ, టీఆర్‌ఎస్, మల్కాజిగిరి లోక్‌సభలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, చేవెళ్ల లోక్‌సభలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ విజయాలపై ఆశలు పెంచుకున్నారు. ఇటు హైద‌రాబాద్ లో గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి వివిధ కేంద్రాల్లో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. గ్రేటర్‌ పరిధిలో అతి తక్కువ ఓట్లున్న హైదరాబాద్‌ లోక్‌సభ ఫలితం త్వ‌ర‌గా వెలువడే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పద్నాలుగు టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల ఓట్లను ఎల్బీ, కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియాలు, ఉస్మానియావర్సిటీ, రెడ్డి విమెన్స్‌ కాలేజీ, కోఠి విమెన్స్‌ కాలేజీ, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నిజాం కాలేజీ, మాసబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ , మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల ఓట్లను పాల్మాకులలోని గురుకుల పాఠశాలలో లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ప్రతి నియోజకవర్గంలో ఐదు బూత్‌ల్లో వీవీప్యాట్లలోని స్లిప్పులను లాటరీలో తీసి లెక్కించిన తర్వాతే తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. కాగా దేశంలోనే అత్యధిక ఓటర్లతో రికార్డు సృష్టించిన మల్కాజిగిరి లోక్‌సభ ఫలితం అధికారిక ప్రకటనకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కుత్బులాపూర్‌ ఓట్లను అత్యధికంగా 34 రౌండ్లలో మేడ్చల్, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను 28 రౌండ్లలో లెక్కిస్తారు. అత్యధిక ఓట్లు పోలైన నియోకజవర్గాల్లో లెక్కింపు టేబుళ్లను సైతం 14 నుండి 24 వరకు ఏర్పాటు చేశారు. ఇక చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక ఓట్లు నమోదైన శేరిలింగంపల్లి అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్‌ 43 టేబుళ్ల ఏర్పాటు చేశారు..