సిబిఐ చీఫ్ అలోక్ వర్మకు మ‌ళ్లీ ఎదురుదెబ్బ

Alok Varma

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు మ‌ళ్లీ ఎదురుదెబ్బ త‌గిలింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తిరిగి మళ్ళీ సిబిఐ డైరెక్టర్ గా బాధ్యతలను స్వీకరించిన అలోక్ వర్మను హైపవర్ కమిటీ తొలగించింది. సీవీసి రిపోర్టులో ఆరోపణల వైపు మొగ్గు చూపిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే వర్మపై సీవీసీ రిపోర్టులో వచ్చిన ఆరోపణలను నిజమేనని నిర్ధారించుకుంది. దీంతో సిబిఐ చీఫ్ గా అలోక్ వర్మను తొలగించింది.

హైపవర్ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ,లోక్ స‌భ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, సుప్రీం కోర్టు న్యాయమూర్తి సభ్యులుగా వున్నారు. ప్రధాని కార్యాలయంలో సుమారు రెండు గంటలపాటు సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.అలోక్ వర్మను అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.దీంతో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావుని మళ్లీ నియమించారు.

సీబీఐ కొత్త డైరెక్టర్ ని నియమించే వరకూ లేదా తుది ఉత్తర్వులు వెలువడే వరకూ నాగేశ్వరరావుకి ఈ అదనపు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.మ‌రొక‌వైపు అయితే అలోక్ వ‌ర్మ ఈ నెల 31 న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు .