విశాఖ రైల్వే జోన్‌ మసి బూసిన మారేడు కాయ

కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్‌ మసి బూసిన మారేడు కాయేన‌న్నారు ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయ‌న మాట్లాడారు. తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇటు విశాఖ రైల్వే జోన్‌ మోసపూరిత ప్రకటన అని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అభివ‌ర్ణించారు. వాల్తేరు డివిజన్‌ను కలపకపోవడం వల్ల రూ.500 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి ఉంటుందన్నారు.

ఆంధ్రుల ఆగ్రహంపై ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. అటు రాజకీయ క్రీడలో భాగంగానే ఆఖరి క్షణంలో కేంద్రం రైల్వేజోన్ ప్రకటించినట్లుగా ఉందన్నారు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌. కేంద్ర ప్రభుత్వం రైల్వేజోన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రైల్వేజోన్ కోసం పోరాడిన విశాఖకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. 90 శాతం ఈ ప్రాంతాన్ని రాయగడ డివిజన్ లోనే ఉంచారని, లోతుగా ఆలోచిస్తే విశాఖకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు

విశాఖ‌వాసుల చిరకాల వాంఛ నెరవేరింది వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ రైల్‌ భవన్‌లో రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌తో కలిసి నిన్న‌ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీ నేపథ్యంలో నూతనంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తున్నామని వెల్ల‌డించారు.

దీనికి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌గా పేరు పెట్టారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్ల తో పాటు ఏపీలోని వాల్తేరు డివిజన్‌ భాగంతో కలిపి ఈ జోన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లోలో, మరోభాగాన్ని రాయఘడ డివిజన్‌లో కలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.