సీఎం పదవిపై కోరిక లేదు – అందలం ఎక్కాలన్న‌ ఆశ లేదు

Pawan Kalyan..
Pawan Kalyan..

ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్ స్పష్టం చేశారు. రాజమండ్రిలో జ‌రిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో తన సహజశైలిలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. గెలుపోటములు తెలియద‌న్న జ‌న‌సేనాని… యుద్ధం చేయడమే తెలుసన్నారు. సీఎం పదవిపై కోరిక లేదని, అందలం ఎక్కాలని ఆశ లేదని చెప్పుకొచ్చారు. పవర్‌స్టార్‌ పదంపైనే ఆసక్తి లేదని, సీఎం పదవిపై ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.

అన్యాయంపై గళమెత్తేందుకే రాజకీయాల్లోకి వచ్చానని స్ప‌ష్టం చేశారు పవన్ కల్యాణ్ . తాను రాజకీయాల్లోకి వచ్చింది స్వప్రయోజనాల కోసం కాదని, ఏదో సంపాదించుకుందామన్న ఉద్దేశం లేనే లేదన్నారు ఆయ‌న‌. సినిమాలు లేకపోయినా ఏ అభిమానిని అడిగినా పట్టెడన్నం పెడతారని చెబుతూ భావోద్వేగాలకు గురయ్యారు ప‌వ‌న్‌. ఇటు జగన్, చంద్రబాబు ఎందుకు విరోధులయ్యారో తెలియడంలేదన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

తనను ఏమీ అనలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జగన్ అన్నా, చంద్రబాబు అన్నా వ్యక్తిగత వైరం ఏమీలేదని స్పష్టం చేశారు అయినా తానేమైనా వేలకోట్లు దోచానా అంటూ జగన్ కు, కులాల పేరుతో రాజకీయాలు చేశానా అంటూ చంద్రబాబుల‌పై ప‌రోక్షంగా ఫైర‌య్యారు జ‌న‌సేనాని.

గత ఎన్నికల సమయంలో తాను కొందరికి పల్లకీలు మోశానంటూ పరోక్షంగా టీడీపీ, బీజేపీలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను పల్లకీలు మోసింది తన కోసం కాదని, ప్రజలను అభివృద్ధి అనే పల్లకీలో ఏమైనా కూర్చోబెడతారేమో అన్న ఆశతో మోశానని తెలిపారు. కానీ కొందరు తనను వాడుకుని ప్రజలను వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.