సారు, కారు, పదహారు, ఢిల్లీలో సర్కారు – కేటీఆర్

KTR
KTR

అసెంబ్లీ ఎన్నిక‌ల విజ‌యంతో అధికారం చేప‌ట్టిన టి ఆర్ ఎస్ మంచి జోరు మీదుంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తోన్న కేటీఆర్ త‌న‌దైన శైలిలో కేడ‌ర్ లో నూత‌న ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ ప్ర‌చారంలో ఆయ‌న సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు… అంటూ ఇదే త‌మ ఎన్నికల స్లోగన్ అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తాము 16 సీట్లలో గెలిపించాలని కోరుతున్నామంటూ తన వ్యాఖ్యల వెనుక రాజకీయ ప్రయోజనాన్ని వివ‌రించారు కేటీఆర్.

ప్రధాని తామిచ్చిన బొకేలు తీసుకున్నారు కానీ, తెలంగాణకు ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. అందుకే, ‘సారు’ (కేసీఆర్)కు చెందిన ‘కారు'(టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు)ను గెలిపించి ‘పదహారు’ (ఎంపీలు) మందిని లోక్ సభకు పంపిస్తే ‘ఢిల్లీలో సర్కారు’ (కేంద్రం) మనదవుతుందని కేటీఆర్ స‌రికొత్త భాష్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో జరుగుతున్న జహీరాబాద్‌ నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని ప్ర‌సంగించారు. కేసీఆర్‌ నాయకత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు ఆయ‌న‌.

కాంగ్రెస్‌, బీజేపీలు దేశాన్ని 70 ఏళ్లు పాలించాయన్నారు. ఇంకా దేశంలో విద్యుత్‌, నీళ్లు, రహదారులు లేని గ్రామాలు ఉన్నాయన్నారు. జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోనే కేసీఆర్‌ పూర్వీకులు ఉన్నారన్నారు. ఏళ్ల క్రితం అప్పర్‌ మానేరు ప్రాజెక్టు కింద పోసాన్‌పల్లి మునిగిపోయిందన్నారు. ఆ సమయంలో కేసీఆర్‌ పూర్వీకులు పోసాన్‌పల్లి నుంచి సిద్దిపేట జిల్లా చింతమడక తరలివచ్చారని గుర్తు చేశారు కేటీఆర్‌.