వివేకా హ‌త్య కేసులో క్లూస్ నే కీల‌కం

ys vivekananda reddy
ys vivekananda reddy

వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని పోస్టుమార్టంలో తేలడంతో ఈ కేసులో నిగ్గు తేల్చేందుకు సీఐడీ అదనపు డీజీ అమిత్ గార్గ్ పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేశారు. వివేకా కేసులో సత్వర దర్యాప్తు కోసం మొత్తం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు ఏపీ డీజీపీ ఠాకూర్. ఈ బృందాలన్నింటినీ సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ అమిత్ గార్గ్ కు అప్పగించినట్టు డీజీపీ తెలిపారు. మ‌రోవైపు వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు. ఆయన ఒంటిపై ఏడు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. తొడ, చేతిపైన కూడా రెండు గాయాలు ఉన్నట్టు గుర్తించారు. నుదిటిపై రెండు పదునైన గాయాలు, తల వెనుక మరో గాయం ఉంది తేల్చారు. రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్ట్ మార్టం నిర్వహించారు.

క్లూస్ టీమ్ వివేకా గదిలో కొన్ని వేలిముద్రలు, పాదముద్రలు సేకరించారు. . తాము సంఘటన స్థలాన్ని పరిశీలించిన సమయంలో ఇంటి వెనుక తలుపు తెరిచే ఉందని క‌డ‌ప ఎస్ పి రాహుల్ వెల్ల‌డించారు. వెనుక తలుపు నుంచి ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. రాత్రి 11.30 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఘటన రాత్రి 11.30 ప్రాంతంలో జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. ఇంటికి ఎవరెవరు వచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు ఎస్పీ. ప్రస్తుతం క్లూస్ టీమ్ మరిన్ని ఆధారాల కోసం శోధిస్తోందని వెల్లడించారు.

అనంతరం పులివెందులలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. వివేకా నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు . మంచి వ్యక్తిత్వం కలిగిన ప్రజానేతను కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి కొన్ని క్లూస్ కూడా దొరికాయని, వీటి ఆధారంగా విచారణ జరుపుతామని పోలీసు అధికారులు వెల్ల‌డించారు.

వివేకా మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని వైసిపి అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో నిజనిజాలు వెలుగు చూస్తాయనే నమ్మకం తమకు లేదన్నారు. అసలైన నిజాలు వెలుగు చూడాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆమె. గుండెపోటుతో వివేకా మరణించారని ప్రాధ‌మికంగా స‌మాచారం వ‌చ్చింది. తాజాగా వివేకాది హత్య అని తేలడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకు పాల్పడింది ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.