లోగుట్టు సిఎం చంద్ర‌బాబుకు ఎరుకే..!

AP Cm Chandra Babu Naidu
AP Cm Chandra Babu Naidu

తెలుగు రాష్ట్రాల‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ముంచుకు వ‌స్తున్నా ఇప్పుడు అంద‌రి దృష్టి ఆంద్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పైనే వుంది. శాస‌న‌స‌భ పోరులో ఎవ‌రు ఎటు వైపు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం, వైసిపి మ‌ధ్యే టైట్ ఫైట్ వుంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నా… మ‌ధ్య‌లో జ‌న‌సేన ఇచ్చే ఝ‌ల‌క్ పైనే అంద‌రి దృష్టి వుంది . దీంతో మూడు పార్టీల మ‌ధ్య‌నే ప్ర‌ధాన పోటీ వుంటుంద‌నే భావ‌న‌లో రాజ‌కీయ వ‌ర్గాలున్నాయి. ఇప్ప‌టికే జ‌న‌సేన సైతం తాము ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించింది. అయితే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పవన్‌ కల్యాణ్‌తో కలిస్తే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు . ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పవన్‌తో కలిసి పోటీ చేస్తారనే మీడియా ప్రశ్నకు చంద్రబాబు నవ్వుతూ సమాధానం దాటవేశారు.

పవన్‌తో కలిసి పోటీ చేయనని చంద్రబాబు చెప్పకపోవడం ఇప్పుడు ఆంద్రాలో హాట్ టాపిక్ అయింది. పవన్‌తోనే తాము కలిసి ఉన్నామంటూ చంద్రబాబు మాట్లాడిన తీరు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్‌తో టీడీపీ బంధం కొనసాగుతోందా అనే సందేహాలు సామాన్య ప్రజలకు కలుగుతున్నాయి. టీడీపీ, జనసేనల మధ్య అంతర్గతంగా బంధం కొనసాగుతుందనే ఆరోపణలకు చంద్రబాబు తాజా వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇదే జ‌రిగితే ఏపి రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి.