బీజేపీయేతర కూటమికి మాయా షాక్ ..!

BSP Supreemo Mayawati addressing press conference at her official residence in Lucknow on Saturday. Express Photo by Vishal Srivastav. 24.03.2018.

జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు ప్రయత్నాలకు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడటానికి బేషరతుగా మద్దతు ఇచ్చిన మాయావతి…అంతలోనే ఆ రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.దీంతో మాయావతి బీజేపీ యేతర కూటమికి కలిసి వస్తారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దళితులపై నమోదైన కేసులను ఎత్తి వేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని… కేసులను ఎత్తి వేయకపోతే, మద్దతుపై తాము పునరాలోచిస్తామని హెచ్చరించారు.ఏ ఒక్క హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని… బీజేపీ మాదిరే కాంగ్రెస్ వ్యవహరించరాదని అన్నారు.

తాజా హెచ్చరిక మధ్య ప్రదేశ్, రాజస్ధాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఒకింత ఇబ్బంది కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిన కాంగ్రెస్ కు ఆ రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటుకు బీఎస్పీ మద్దతు కీలకమైంది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో మాయావతి పార్టీ హెచ్చరిక ఆ ఏర్పాటు యత్నాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదని మాయావతి చెప్పారు. హామీలను ఇవ్వడంలో కాంగ్రెస్, బీజేపీలను ఒకే నాణేనికి రెండు వైపులుగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఈ మరకను తొలగించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందని చెప్పారు.