పార్టీ మారిన ఆ 23 మందికి టిక్కెట్లు ద‌క్కేనా..!

AP CM Chandra Babu Naidu
AP CM Chandra Babu Naidu
సార్వత్రిక ఎన్నికల నేప‌ధ్యంలో అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ జోరు  పెంచింది. తొలి జాబితా దాదాపుగా ఖరారయింది. అయితే ఫైన‌ల్ చిట్టాపై  ఆశావహుల్లో, సిట్టింగులలో విపరీతమైన టెన్షన్‌ నెలకొని వుంది.  ప్రజలు, కార్యకర్తల అభిప్రా యాలు, ప‌లు ర‌కాల నివేదికలను దృష్టిలో  పెట్టుకుని  చిట్టాను వ‌డ‌బోస్తున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. వైసిపి  నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 23మంది ఎమ్మెల్యేల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నార‌నేది  ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దీంతో వీరి ఆందోళ‌న రెట్టింపుగా మారింది. ఒకవేళ ఫ‌స్ట్ లిస్ట్ లో తమకు చోటు దక్కకపోతే తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అవుతుందేమోనన్న భయం వారిని పట్టిపీడిస్తోంది. అనంతపురం జిల్లా కదిరిలో అక్కడ వైసిపి నుండి అత్తార్‌ చాంద్‌ భాషా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఈయనకు టిక్కెట్టు ఖరారు చేయలేదు. వారి సామాజికవర్గం వారు ఎక్కువ‌గా వున్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు టిక్కెట్ కేటాయించ‌క‌పోవ‌డంతో వారంతా నిరాశకు గురవుతున్నారు.

ఇదేవిధంగా కృష్ణా జిల్లా పామర్రులో వైసిపికు చెందిన ఉప్పులేటి కల్పన ఎమ్మెల్యేగా గెలుపొందారు . అక్కడ దాదాపు 40 వేల పైచిలుకు ఎస్సీ వర్గం ఉంది. ఆమెకు ఇప్పటివరకూ టిక్కెట్టు ఖరారు చేయలేదు. అలాగే ఎస్టీ సామాజికవర్గం నుండి పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పరిస్థితి కూడా ఇంచుమించు అదే పరిస్థితి నెల‌కొంది. కర్నూలు ఎంపీగా గెలుపొందిన బుట్టా రేణుక పరిస్థితి కూడా సేమ్ టూ సేమ్ .

ఈ నేపథ్యంలో పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలతోపాటు ఎంపీల పరిస్థితి దాదాపుగా ఇలానే ఉంది. దీంతో వీరంద‌రికీ కంటిమీద కునుకులేకుండా పోయింది. ఇటు కాంగ్రెస్‌ పార్టీ నుండి వస్తున్న సీనియర్లకు స్థానం కల్పించడంలో కూడా చంద్రబాబు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా నేరుగా కార్యకర్తల మ‌నోభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. స్వయంగా ఆయ‌నే వాటిని పరిశీలించి డిసైడ్ చేస్తున్నారు.

వరెవ‌రికి ఎక్కడ ఎలా ప్రాధాన్యత కల్పించాలో అన్న అంశాన్ని తన సన్నిహితుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు అధినేత చంద్ర‌బాబు. జిల్లాల వారీగా టిక్కెట్లు కేటాయింపుపై దృష్టి సారించిన ఆయ‌న‌, పార్లమెంటరీ స్థానాలవారీగా సమీక్షలు నిర్వహిస్తు న్నారు. ఆయా పార్లమెంటు స్థానాల పరిధిలోని అసెంబ్లి స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై ఆచి తూచి అడుగులేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్నవారిలో అత్యధిక శాతం సిట్టింగులకే టిక్కెట్లు ఇవ్వాలని క్షేత్రస్థాయి కార్యకర్తలు కోరుతున్నారు. దీంతో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం టిక్కెట్టు మీద గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది తిరిగి టిక్కెట్టు పొందే అవకాశాలు క‌న‌ప‌డుతున్నాయి. ఈ నెల 12 లేదా 13వ తేదీల్లో టీడీపీ తొలి జాబితా విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.