ఆంద్ర‌ప్ర‌దేశ్ ఒంటరి పోరులో విజేత‌లెవ్వ‌రో..!

Ap-Political-Parties
Ap-Political-Parties
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి అన్ని పార్టీలు ఒంటరి పోరుకే రెఢీ అవుతున్నాయి.  ఏ రెండు ప్రధాన పార్టీల మధ్య పొత్తులుండే అవకాశాలు క‌న‌ప‌డ‌టం లేదు. కేవలం జనసేన, వామపక్షాల మధ్య కొన్ని సీట్ల సర్దుబాటు మినహా మరే విధమైన పొత్తుల ఛాన్స్ కాన‌రావ‌డం లేదు.  అధికార పార్టీ తెలుగుదేశం ఇప్పటికే సీట్ల కేటాయింపు ప్రక్రియ చేప‌ట్టింది. లోక్‌సభ నియోజక వర్గాల ప‌రిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ ల  వారీగా  స‌మీక్షలు జ‌రిపింది. ఎక్కువగా సిట్టింగ్‌లకే ఆ పార్టీ అవకాశం కల్పించాలని డిసైడ్ అయింది.

వివాద‌స్ప‌ద సిట్టింగ్‌ల‌కు చుక్కెదురు కానుంది. ఇప్పటికే ఆ పార్టీ ఒక్కొక్కటిగా సీట్లను ఖరారు చేస్తూ మీడియాకు చెబుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీకి మరో ప్రధాన పార్టీతో పొత్తు ఉంటుందన్న ప్రచారంలో నిజం వుండే అవ‌కాశాలు లేకుండా పోయాయి. తెలంగాణ‌లో ఫ‌లితాల నేప‌ధ్యంలో హ‌స్తం పార్టీతో జ‌త‌క‌ట్టేందుకు తెలుగుదేశం వెన‌క‌డుగు వేసింది. అటు గ‌త ఎన్నిక‌లలో వ‌లే ఈ సారి కూడా ఒంటరి పోరుకు వైసిపి సిద్ద‌ప‌డింది. ఆ పార్టీలోనూ ఆశావహుల సంఖ్య ఎక్కువ‌గానే వుంది.

ఇటీవ‌ల ఇతర పార్టీల్నుంచి వలసలు కూడా వైసిపికి బాగా పెరిగాయి. దీంతో పూర్తిస్థాయిలో నాయకుల రాక పూర్తయిన తర్వాత గాని టికెట్ల ఖరారు జరపకూడదని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే కొన్ని చోట్ల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలకే సీట్లు దక్కుతాయని స‌మాచారం. ఇటు జనసేన కూడా 175 నియోజకవర్గాల్నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 2400మందికి పైగా ఆశావహులు పోటీకి సై అంటున్నారు.

పార్టీ స్క్రీనింగ్ క‌మిటీ అభ్య‌ర్ధుల‌ వ‌డ‌పోత‌లో నిమ‌గ్న‌మైంది. జనంలో పార్టీ బలంగానే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో నాయకులింకా ఆ పార్టీకి లభ్యం కావడం లేదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం ఉత్సాహవంతులు, యువకులకే ఎక్కువ సంఖ్యలో టికెట్ లు ల‌భించే అవ‌కాశాలున్నాయి. ఇక ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం గల నాయకులు, ఇతర పార్టీల నుంచి వ‌చ్చే సీనియ‌ర్ ల‌కు అవకాశం కల్పించేందుక్కూడా రెఢీ అవుతోంది.

వామపక్షాలు జనసేనతో జ‌త క‌ట్టి పోటీకి దిగడం ద్వారా ఈ సారి ఖచ్చితంగా అసెంబ్లిలో ప్రవేశించాలని భావిస్తున్నాయి. ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తికాక పోయినా పొత్తు మాత్రం దాదాపుగా ఖరారైంది. ఇక జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపిల నుంచి పోటీకి బలమైన అభ్యర్ధులు కొర‌త వీరిని వెంటాడుతూనే వుంది. గ‌త ఎన్నిక‌ల‌లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ ఈ సారి జ‌వ‌స‌త్వాలు పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే బిజేపి గతం కంటే తన ప్రాభవాన్ని కోల్పోయింది.

తాజాగా జరిగిన పాక్‌పై దాడుల పరిణామాల్తో పార్టీ పట్ల ప్రజాదరణ పెరుగుతుందని ఆ పార్టీ నాయకులు ఆశించినా అది కార్యరూపం దాల్చలేదు. అందుబాటులో ఉన్న నాయకుల్నే బరిలో దింపడం ద్వారా పార్టీ ఉనికి కాపాడుకునేందుకు బిజెపి విశ్వ‌ప్రయత్నాలు చేస్తోంది . ఈ సారి ప్రధాన పార్టీలు ఐదు విడివిడిగానే బరిలో దిగుతున్నాయ‌ని దాదాపుగా డిసైడ్ అయిపోయింది. ఈ ఒంట‌రి పోరులో చివ‌రికి ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌నేది ఇప్పుడు ఆంద్ర‌ప్ర‌దేశ్ లో హాట్ టాపిక్ గా మారింది.