అంతర్మథనంలో తెలంగాణ కాంగ్రెస్

Congress Party
Congress Party
తెలంగాణలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ అధికార టీఆర్‌ఎస్ పార్టీ  ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టింది.  దీనిలో భాగంగా నిన్న ఆదివాసి ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు కారు పార్టీలో చేరారు.  ఇప్పుడు తాజాగా  నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  కూడా వీరి బాటలోనే నడవడంతో కాంగ్రెస్ పార్టీ అంతర్మథనంలో పడింది. ఆయ‌న  టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్న‌ట్లు స‌మాచారం. 

లింగయ్య టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లింగయ్య అజ్ఞాతంలో ఉన్నారు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఎవరికీ అందుబాటులోకి లేకుండా పోయారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం లింగయ్యకు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుబట్టి లింగయ్యకు టికెట్ ఇప్పించారు.

లింగయ్య గెలుపుకోసం కోమటిరెడ్డి బ్రదర్స్ కృషి చేశారు. తాజా ప‌రిణామంపై ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పందించారు. చిరుమర్తి ఇంత నమ్మకద్రోహం చేస్తాడని అనుకోలేదన్నారు ఆయ‌న‌. రెండు సార్లు టికెట్‌ ఇప్పించి ఆయ‌న గెలుపు కోసం కృషి చేశామని చెప్పుకొచ్చారు. తనతో సంప్రదించకుండానే చిరుమర్తి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు.